మహిళా రిజర్వేషన్ చట్టంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం: మల్లికార్జున ఖర్గే

మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ చట్టంపై భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఏప్రిల్ 15న తమ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.


మహిళా రిజర్వేషన్ల వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంపై కేంద్రం లోతైన చర్చలు జరపడం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతోందని ఖర్గే విమర్శించారు. ప్రభుత్వం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల తామే చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది కాంగ్రెస్ చిరకాల వాంఛ అని, గతంలో సోనియా గాంధీ ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. అప్పట్లోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తమదేనని స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తపరిచే అభిప్రాయాలను, తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఖర్గే వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో పారదర్శకత, వేగం ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు మహిళా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరిని స్పష్టం చేస్తున్న తరుణంలో, కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Mallikarjun Kharge
Women Reservation Bill
Nari Shakti Vandan Adhiniyam
All-Party Meeting
Congress Party
Sonia Gandhi
33 Percent Reservation
Political Parties
Indian Politics

More Telugu News